వచ్చే 6 నెలల్లో పాలమూరును పూర్తి చేయాలి: శ్రీనివాస్ గౌడ్

కలం, వెబ్ డెస్క్: వచ్చే ఆరు నెలల్లో పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి (Palamuru Rangareddy Project) ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు అనుమతులకు గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టుతో లింక్ పెట్టడం తెలంగాణ పాలిట ద్రోహమే అవుతుందని మండిపడ్డారు. కేంద్రంలో టీడీపీ అనుకూల ప్రభుత్వం ఉందని ఏపీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఐదుగురు ఎంపీలు ఉంటే తెలంగాణకు ఇంత అన్యాయం జరిగేదా? అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలంగాణ అనుకూల గొంతులు లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.

రేవంత్ రెడ్డిని చరిత్ర క్షమించదు..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర చేపడుతోందని చెప్పగానే కాంగ్రెస్ నేతలు హడావుడి స్టార్ట్ చేశారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. వెంటనే సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారని అన్నారు. ఇరిగేషన్ అధికారులు లేకుండా సీఎం రివ్యూ చేస్తే ఏం లాభం? అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతోనే ప్రజల బ్రతుకులు ముడిపడి ఉన్నాయని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చనిపోయిన వారి జాడ ఇప్పటి వరకు లేదని.. రేవంత్ రెడ్డిని చరిత్ర క్షమించదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పక్షాన పాదయాత్ర బరాబర్ ప్రారంభిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. పాదయాత్రలో తాము చేసిన పనులను ప్రజలకు చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో పాదయాత్ర చేసి చూపించాలని డిమాండ్ చేశారు. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు ఇప్పటికే 95 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. కాలువలు దాదాపు 98 శాతం బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేశామని అన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత టెండర్లు క్యాన్సల్ చేశారని మండిపడ్డారు.

నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు..

ఏపీలో చీఫ్ సెక్రెటరీగా పని చేసిన ఆదిత్య నాధ్ దాస్ ను సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ, ఏపీ విభజన నీళ్లు, ఉద్యోగాల కోసం జరిగిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక్కటి అయ్యాయని దుయ్యబట్టారు. ఆదిత్య నాధ్ దాస్ తో తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ సలహాదారుగా ఎవరూ దొరకలేదా? పాలమూరు జిల్లా నాశనం కావాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరా ఎండిపోకుండా కేసీఆర్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తే.. కాంగ్రెస్ హయాంలో జనవరిలోనే జూరాల ఎండిపోయిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లను రీ కాల్ చేయాలన్నారు. బీఆర్ఎస్ చేపట్టబోయే పాదయాత్ర జూన్ లో ఉంటుందని.. త్వరలోనే తేదీ ప్రకటిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు తమ పాదయాత్ర ఉంటుందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>