ఉద్యోగుల డిమాండ్లకు సర్కార్ సానుకూల హామీలు

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ (Maram Jagadeeshwar) తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లోని టీఎన్జీఓల సంఘం భవనంలో జేఏసీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఇచ్చిన ‘చలో హైదరాబాద్’ పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు సమాయత్తమయ్యారని తెలిపారు. ఉద్యోగుల ఆవేదనపై ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ప్రభుత్వానికి చేరాయని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని నిరసనను వాయిదా వేసుకోవాలని కోరడంతో ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు.

అనంతరం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లపై సానుకూల హామీలు లభించాయని జగదీశ్వర్ వెల్లడించారు. దసరా పండుగ సందర్భంగా రెండు డీఏలు, సంక్రాంతి నాటికి మరో డీఏ విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సీపీఎస్ విధానంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుంటామని ప్రభుత్వం తెలిపిందన్నారు. ఉద్యోగుల వేతన సవరణ (PRC) కమిటీ నివేదికను త్వరితగతిన పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత ప్రక్రియను వేగవంతం చేసి, పకడ్బందీగా ఉచిత ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్ణీత వ్యవధిలో అమలు చేయాలని, ఉద్యోగుల హక్కుల సాధనకు జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు.

ఈ నెల 30న సీఎంకు ఘన స్వాగతం

ఈ నెల 30న కరీంనగర్ నూతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవిష్కరణకు హాజరుకానున్న ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ తరఫున హృదయపూర్వక స్వాగతం పలకాలని ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులకు జగదీశ్వర్ పిలుపునిచ్చారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళి చరణ్, టీఎన్జీఓల సంఘం కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావు, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, ప్రభాకర్ రావు, టీఎన్జీఓల రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీందర్ సింగ్, ప్రభాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>