ఇంటర్ లో కొత్త కోర్సు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి షురూ

కలం, వెబ్ డెస్క్ : విద్యార్థుల ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానంలో నూతన మార్పులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) శ్రీకారం చుట్టింది. అకౌంట్స్, ఎకనామిక్స్​, కామర్స్​​ సబ్జెక్టులతో కలిపి ACE (Accounts, Commerce, Economics) అనే కొత్త గ్రూప్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కారణంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న MEC (Maths, Economics, Commerce) గ్రూప్ కనుమరుగు కానుంది.

సాధారణంగా కామర్స్ చదివే విద్యార్థులకు లెక్కల (Mathematics) పట్ల కొంత ఆందోళన ఉంటుంది. దీనిని గమనించిన ఇంటర్మీడియట్ బోర్డు గణితం స్థానంలో అకౌంట్స్ ను ఒక ప్రధాన సబ్జెక్ట్ గా చేర్చి ACE గ్రూప్ ను రూపొందించింది. అయితే ఎంఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు రెండో ఏడాది యథావిధిగా చదువుకోవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉమ్మడి మెదక్​ జిల్లాలోని జూనియర్​ కళాశాలలు, గురుకులాలు, కస్తూర్బాలు ఆదర్శ పాఠశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలల్లో ACE కోర్సు అందుబాటులోకి రానుంది.

కాగా, ఇంటర్మీడియట్​లో ‘ఏసీఈ’ కోర్సు పూర్తి చేసే విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అధికారులు అంటున్నారు. డిగ్రీలో చేరాలనుకునే వారు కామర్స్ గ్రూప్ లో , బీకాం, బీబీఏ, బీఏలలోనూ చేరవచ్చని చెబుతున్నారు. అనంతరం ఎంబీఏ, ఎంసీఏలతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా సీఏ కోర్సు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. బ్యాంకింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>