కలం వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరం అడ్మిషన్‌ల కోసం తెలంగాణ ఇంటర్ విద్యా మండలి (Telangana Inter Board) షెడ్యూల్ విడుదల చేసింది. మే 8 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మే 31 వరకు అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30 నాటికి మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుంది. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు పొందవచ్చని అధికారులు సూచించారు. అయితే తర్వాత ఒరిజినల్స్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అడ్మిషన్ల కేటాయింపులో విద్యా సంస్థలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఇంటర్ విద్యా మండలి ఆదేశించింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు, బాలికల కోసం ప్రత్యేకంగా 33.33 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. అడ్మిషన్లు కేవలం పదో తరగతిలో సాధించిన జీపీఏ, సబ్జెక్టుల గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే నిర్వహించాలని, ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని కళాశాలలకు తేల్చి చెప్పింది. విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లోనే చేరాలని, పూర్తి వివరాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు కోరారు.

