తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ (Telangana Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా కేరళలో ప్రచారం చేసి కాంగ్రెస్ కూటమి గెలుపునకు ప్రయత్నించిన ముఖ్యమంత్రికి మంత్రులు అభినందనలు తెలిపారు. ఈ నెల 21న మరోసారి కేబినెట్ సమావేశం కాబోతుంది.

నెలాఖరుకి భూముల విలువ పెంపు..

రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని నిర్ణయించింది. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చు తగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని భావిస్తోంది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇవ్వనుంది. ఈనెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకి రానున్నాయి. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉన్నారు. ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిస్తున్నారు. దీంతో పాటు వాస్తవంగా మార్కెట్‌లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందుకు శాస్త్రీయ పద్ధతి అనుసరించి ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ⁠జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరిస్తుంది. ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యన్ సూచనలను గమనంలోకి తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ⁠ ⁠

హిల్ట్ దరఖాస్తుదారులకు ఒక అవకాశం..

హిల్ట్ పాలసీ ప్రకారం నగరంలోని పరిశ్రమలు ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల విలువ పెరగకముందే షిప్టింగ్ ప్రక్రియను మొదలుపెడితే తొలుత 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని క్యాబినెట్ నిర్ణయించింది. మిగిలిన 90 శాతాన్ని 90 రోజుల వ్యవధిలో చెల్లించవ్చని ఆఫర్ ప్రకటించింది. ఆ మేరకు భూముల విలువ పెరగకముందే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలా దరఖాస్తు చేసుకునేవారికి మంత్రివర్గం వెసులుబాటు కల్పించేలా క్యాబినెట్ చర్చింది ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది.

పంట నష్టం బాధితుల వివరాల సేకరణ..

నిన్న అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర మంత్రివర్గానికి సమాచారం అందింది. వెంటనే ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

NDDB పరిధిలోకి మదర్ డైరీ

నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని (మదర్ డైరీ) నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు అప్పగించేలా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ డైరీకి చెందిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్.. ఇవన్నీ నేషనల్ డెయిరీ బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ఒకప్పుడు లాభాల మాటలో ఉన్న మదర్ డైరీ లావాదేవీలు గత ప్రభుత్వంలో నష్టాల్లోకి వెళ్లాయని, రైతులకు కూడా ఇబ్బందికరంగా మారిందని, తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేసేందుకు క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

సోలార్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు..

రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ల పక్కనే స్థలానికి అనుగుణంగా సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. పైలట్ పద్ధతిన ఒక్కో జిల్లాలో రెండు చొప్పున మొత్తం 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు కానున్నాయి. ఒక్కో ప్లాంట్ రెండు మెగావాట్ల చొప్పున నిర్మాణం కానున్నాయి. దాదాపు రూ.66.50 కోట్లతో 18 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.

బుద్ధ వాగు వరద కాలువ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి ఎడమ వరద కాలువ నిర్మాణానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందనున్నది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమిని మార్కెట్ యార్డుకు అప్పగించేందుకు మంత్రివర్గం తెలిపింది.

అన్ని స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకే..

రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, టీ-శాట్‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.

పన్నుల క్లియరెన్స్ కోసం OTS..

క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేరుకునేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 5864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైమ్ సెటిల్మెంట్‌పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>