కలం, కరీంనగర్: గత రెండు సంవత్సరాల నుంచి వివాదంలో కొనసాగుతున్న నగరంలోని ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ హుదా హైస్కూల్ వివాదం (Huda School Dispute) ఎంఐఎం పార్టీ నేతల చొరవతో ముగిసింది. ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ చొరవతో జిల్లా ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ నేతృత్వంలో స్కూలు యాజమాన్యాన్ని బిల్డింగ్ యాజమాన్యాన్ని ఇద్దరినీ సమన్వయపరిచారు. ఇరు వర్గాలు ఒప్పుకొని రాజీ కుదరడంతో లీజు అగ్రిమెంట్ ను రాబోయే 2039 వరకు అనగా 13 సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగేందుకు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కరీంనగర్ లో అగ్రిమెంట్ లీజు డీల్ ను చేసుకున్నారు.
దీంతో 800 వందల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం కాకుండా వారి చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎంఐఎం నేత గులాం అహ్మద్ హుస్సేన్ ఇరు వర్గాలను సమన్వయపరచడంలో సఫలీకృతులయ్యారు. ఈ వివాదాన్ని ముగింపు పలకడానికి చొరవ తీసుకుని సహకరించిన ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీకి, ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ కు, పోలీసు శాఖకు హుదా హైస్కూల్ అధ్యక్షుడు అహ్మద్ అబ్దుల్ అజీమ్, డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో మిన్హాజ్ మొహియుద్దీన్, బిల్డింగ్ యజమాని మహమ్మద్ ఖలీల్ ఉర్ రహమాన్, హుదా స్కూల్ ప్రెసిడెంట్ అహ్మద్ అబ్దుల్ అజీమ్, స్కూల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

