కలం, సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ (Bullet Train) సౌకర్యం కల్పించడంతో పాటు స్థానికంగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్షాల ఆధ్వర్యంలో బృహత్ ధర్నా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్సు డిపో ఎదుట చేపట్టిన ఈ నిరసనలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. సూర్యాపేటను బుల్లెట్ ట్రైన్ మార్గంలో చేర్చి, ఇక్కడ ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సూర్యాపేట జిల్లా ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.

