కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటనలు అడపాదడపా కొనసాగుతున్నప్పటికీ, జిల్లా కేంద్రం నల్లగొండకు వచ్చేసరికి పదేపదే వాయిదా పడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం అధికారిక కారణాల వల్లేనా? లేక కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయ సమీకరణాల ప్రభావమా? అనే చర్చ జోరుగా సాగుతున్నది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటనలపై ప్రకటనలు ఇవ్వడం, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడం, చివరి నిమిషంలో సీఎం టూర్ వాయిదా పడటం స్థానిక కాంగ్రెస్ శ్రేణులను నిరాశకు గురిచేస్తున్నది. గతంలో ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల ఓపెనింగ్ నుంచి ఈనెల 17న కనగల్‌లో జరగాల్సిన హ్యామ్ రోడ్ల ప్రారంభోత్సవం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మరోసారి ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్, బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాట్లు జరుగుతుండటంతో ఈసారైనా సీఎం వస్తారా..! అనే ఆసక్తి నెలకొంది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి కోమటిరెడ్డి సోదరులతో రాజకీయ విభేదాలు ఉన్నాయనే ప్రచారమూ లేకపోలేదు. ఎన్నికల తర్వాత రేవంత్ సీఎం కావడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి చేపట్టినా పాత విభేదాలు పూర్తిగా సమసిపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నా యి. దీంతో పర్యటనల వాయిదాల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చకు మరింత బలం చేకూరుతున్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ, భువనగిరి, యాదగిరిగుట్ట, హుజూర్‌నగర్, దేవరకొండ ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పట్టున్న నల్లగొండ నియోజకవర్గంలో మాత్రం పర్యటనలు వాయిదా పడుతుండటం గమనార్హం.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రిని తన నియోజకవర్గానికి తీసుకురావడంలో మంత్రి కోమటిరెడ్డి విఫలమవుతున్నారనే విమర్శలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అయితే ఇతర అధికారిక కార్యక్రమాలు, జిల్లాల పర్యటనల కారణంగానే సీఎం రాలేకపోతున్నారని మంత్రి వర్గీయులు చెబుతున్నారు. మరో వారం, పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటనకు వస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే ఈసారి పర్యటన ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సీఎం నల్లగొండలో అడుగుపెట్టిన తర్వాతే ఈ రాజకీయ సస్పెన్స్‌కు పూర్తి స్థాయిలో తెరపడే అవకాశం ఉంది.

