కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి శివారులోని ఐఐటీ హైదరాబాద్‌లో హాఫ్ మారథాన్ 2026 (Half Marathon 2026) మూడవ ఎడిషన్‌ను ఘనంగా నిర్వహించారు. దేశంలోని వివిధ నగరాల నుంచి సుమారు 3,500 మంది రన్నర్‌లు ఈ మారథాన్‌లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో 21.1 కి.మీ హాఫ్ మారథాన్, 10 కి.మీ టైమ్డ్ రన్, 5 కి.మీ టైమ్డ్ రన్, 5 కి.మీ ఫన్ రన్ విభాగాలను నిర్వహించారు. భారతదేశపు తొలి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత మురళీకాంత్ పెట్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని మారథాన్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమం ఫిట్‌నెస్, పట్టుదల, సమాజ భాగస్వామ్యంతో పాటు ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పింది. మారథాన్‌లో పాల్గొన్న రన్నర్‌లకు మురళీకాంత్ పెట్కర్ ప్రేరణనిచ్చారు. ఐఐటీ హైదరాబాద్ వార్షిక క్రీడా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ మూడవ ఎడిషన్‌లో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఫిట్‌నెస్, చురుకైన జీవనశైలిపై పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబించింది.

