కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని మొహమ్మదాపూర్ గ్రామంలో తెలంగాణ భగత్ సింగ్ గా పేరున్న అనభేరి ప్రభాకర్ రావు (Anabheri Prabhakar) స్మారక పార్క్, హాల్ అభివృద్ధికి 2.30 కోట్ల నిధులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. అనభేరి ప్రభాకర్ రావు స్మారక పార్క్, హాల్ అభివృద్ధికి రూ.2.30 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ నిధులతో స్మారక పార్క్, హాల్ పునరుద్ధరణ, అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల కల్పన తదితర పనులు చేపట్టనున్నారు.
తెలంగాణ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన అనభేరి ప్రభాకర్ రావు స్మారక ప్రదేశాన్ని మరింత అభివృద్ధి చేసి, భావితరాలకు చరిత్ర, స్ఫూర్తి, వారసత్వాన్ని అందించేలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తో ఈ నిధులు మంజూరు అయ్యాయి. దీంతో సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్ తో పాటు అనభేరి, సింగిరెడ్డి అమరుల కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

