కలం, కరీంనగర్: కరీంనగర్ నగరం మళ్లీ అభివృద్ధి పథంలో పయనించాలంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో నిలిచిపోయిన పనులను వేగవంతం చేసి హైదరాబాద్ తర్వాత అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని ఐటీ టవర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫోర్ వీలర్స్ అసోసియేషన్ భవనాన్ని గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో భవనాన్ని ప్రారంభించిన అనంతరం సమావేశంలో మాట్లాడారు.
భవన నిర్మాణానికి గతంలోనే రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు గంగుల గుర్తుచేశారు. సభ్యుల సౌకర్యార్థం త్వరలోనే ఏసీలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ కార్యక్రమాలు లేని సమయంలో భవనాన్ని సామాన్య ప్రజల శుభకార్యాలకు తక్కువ అద్దెకు కేటాయించాలని సూచించారు. దీనివల్ల సంఘానికి ఆదాయం సమకూరడంతో పాటు భవన నిర్వహణకు ఉపయోగపడుతుందని తెలిపారు.
గత పదేళ్లలో నగర రూపురేఖలు మార్చాం
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విశాలమైన రహదారులు, ఐటీ టవర్, మానేరు రివర్ ఫ్రంట్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని గంగుల పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నగర అభివృద్ధి కుంటుపడిందని, చెత్తాచెదారం, వీధిలైట్ల సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.
రెండేళ్లలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి
కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, రెండేళ్లలోపు పూర్తి చేస్తామని గంగుల తెలిపారు. దీంతో నగర భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని, కరీంనగర్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అసోసియేషన్ భవన నిర్మాణానికి సహకరించి, భవిష్యత్తులోనూ సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన గంగుల కమలాకర్‌కు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆల్ ఫోర్ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు వడ్లూరి శ్రీనివాస్, అధ్యక్షులు కానిగంటి రమేష్, ఉపాధ్యక్షులు ఎం.డి. షాఫీరుద్దీన్ బాబా, జనరల్ సెక్రటరీ జాప మునిందర్ రెడ్డి, సహాయ ప్రధాన కార్యదర్శి మట్టెల బాబు, అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

