కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయాల (IDOC) ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల (Telangana Thalli Statue) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.80 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ జీఓ విడుదల చేసింది. 2025 జూలై 1న ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు ఆమోదం తెలిపి, 2025 డిసెంబర్ 9 నాటికి పనులు పూర్తి చేసి ఆవిష్కరించాలని సూచించింది. అనంతరం ఆర్ అండ్ బీ భవనాల చీఫ్ ఇంజినీర్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.5,80,00,000 నిధులు మంజూరు చేసింది. ఇందులో రూ.2.5 కోట్లు 2025-26 బడ్జెట్ అంచనాల్లోని నిధుల నుంచి, మిగతా రూ.3.3 కోట్లు అదనపు నిధుల రూపంలో విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవసరమైన సందర్భంలో అదనపు గ్రాంట్లు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నిధులను 4059 క్యాపిటల్ అవుట్‌లే ఆన్ పబ్లిక్ వర్క్స్ ఖాతా కింద వినియోగించనున్నారు. తెలంగాణ గవర్నర్ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. విగ్రహాల ఏర్పాటు పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్ అండ్ బీ భవనాల చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు.


