ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. రూ.1000 కోట్ల బ‌కాయిలు విడుద‌ల‌

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల (Pending Dues) కోసం రూ.1000 కోట్ల నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధులు విడుదల చేశారు. ​గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేర‌కు మార్చి 2026 వరకు ప్రతి నెల ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెర‌వేర్చింది.

ఉద్యోగుల ఆర్థిక అవసరాలను గుర్తించిన ప్ర‌భుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం భ‌ట్టి ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.1000 కోట్లను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. ​పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్‌ బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేసింది. రిటైర్‌మెంట్స్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న‌ వేలాది మంది సీనియర్ సిటిజన్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశంగా చెప్ప‌వ‌చ్చు.

ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా, ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం మెడికల్ బిల్లుల చెల్లింపులు అత్యంత వేగంగా జరుగుతున్న‌ట్లు స‌మాచారం. ​ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా మెడికల్ బిల్లుల చెల్లింపులు రెగ్యులర్‌గా జరిగేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పెంచిన నిధులు, క్లియర్ అయిన జీపీఎఫ్‌ బకాయిలు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం చొరవతో పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>