కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో ఉన్న భద్రాచలం (Bhadrachalam) పట్టణ ప్రజలు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. జనగణన స్వీయ నమోదులో భద్రాచలం పట్టణంలోని కొన్ని ప్రదేశాలు తెలంగాణలో లేనట్లుగా చూపిస్తుండటంతో స్థానిక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో స్వీయ నమోదు (self-enumeration) జనగణన ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రజలు ఆన్‌లైన్‌లో (se.census.gov.in) జనగణన వెబ్‌సైట్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్‌లో జియో కోడింగ్ చేస్తున్నపుడు స్థానిక ప్రజలు వివరాలు నమోదు చేస్తుంటే, “తెలంగాణకు మాత్రమే పరిమితం” అనే మెసేజ్ వస్తుండటంతో వారు ఆశ్చర్యంతో పాటు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి..
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల కేటాయింపు, నియోజక వర్గాల పునర్విభజన, అట్టడుగు వర్గాల గుర్తింపు వంటివన్నీ జనగణన మీద ఆధారపడి ఉంటాయి. అలాగే జనగణనలో జియో కోడింగ్ చాలా ప్రధానమైనది. జియో కోడింగ్ ద్వారా మనం ఎక్కడి నుంచి వివరాలు నమోదు చేస్తున్నామనేది తెలిసిపోతుంది. కాబట్టి భద్రాచలం తెలంగాణలో లేదు అనే సందేశం వస్తుండటంతో ప్రజలు ప్రభుత్వ పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు చర్యలు తీసుకోండి..
మరో పక్క గూగుల్ మ్యాప్స్ (Google Maps) కూడా భద్రాచలంలోని కొన్ని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా చూపిస్తుందని, కొత్తగూడెం, భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో తరచుగా ప్రయాణించే ప్రయాణికులు చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్ర విభజన జరిగి సుమారు 11 ఏళ్ళు అవుతున్నా.. భద్రాచలం ప్రజలు ఇంకా స్థానికతకు సంబంధించిన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం సమగ్ర అభివృద్ధి కోసం రూ.586 కోట్లు కేటాయించి రూ.351 కోట్లు మంజూరు కూడా చేసింది. పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భద్రాచలం తెలంగాణలో లేదని ఆన్‌లైన్‌లో చూపించడం విడ్డూరంగా ఉందని, కాబట్టి ఇప్పటికైనా అధికారులు గూగుల్ మ్యాప్స్‌తో పాటు అన్ని రకాల ఆన్‌లైన్ వేదికల్లో భద్రాచలం తెలంగాణలో చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తహశీల్దార్ స్పందన
ఇదే విషయానికి సంబంధించి స్థానిక తహశీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. భద్రాచలంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బస్టాండ్, బ్రిడ్జి, పున్నమి రిసార్ట్, ఫారెస్ట్ ఆఫీస్ వంటి ప్రదేశాల్లోనీ ప్రజలు స్వీయ నమోదులో స్థానికత సమస్యను ఎదుర్కొన్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. సమస్యను జనాభా లెక్కల సాంకేతిక బృందానికి నివేదించినట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో సమస్య ఒక కొలిక్కి వస్తుందని జనగణన బృందం తెలిపిందని అన్నారు. కాగా జనగణన స్వీయ నమోదుకు సంబంధించిన ఎడిట్ ఆప్షన్ ఎన్యూమరేటర్ల దగ్గర ఉంటుంది. వారు మే 11 తేదీ నుంచి ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. స్వీయ నమోదులో ఏవైనా మార్పులు చేయాలంటే, ఎన్యూమరేటర్లు ఇంటింటి సర్వేకు వచ్చినపుడు చేసుకోవచ్చని తహశీల్దార్ తెలియజేశారు.

