కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. వారం రోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. చిలిప్ చెడ్ మండలంలోని చండూరు గ్రామానికి చెందిన రేణుకకు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. వచ్చే వారం పెళ్లి ఉండగా.. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రేణుక మంగళవారం తన తమ్ముడు పరశురాం(20)తో కలిసి బయటకు వెళ్లింది. అక్కాతమ్ముడు బైక్‌పై వెళ్తుండగా ఓ కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో పరశురాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో రేణుక రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలపాలైంది. పెళ్లి సందర్భంగా ఈరోజు రేణుక ఇంట్లో పసుపుకొట్టే కార్యక్రమం ఉండగా రోడ్డు ప్రమాదంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రేణుక ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.

