కలం, నిర్మల్: రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ సాగును ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి (Kodanda Reddy) స్పష్టం చేశారు. గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో కలిసి సేంద్రియ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యానవన పంటల సాగు, ప్రభుత్వ ప్రోత్సాహం, రైతుల సంక్షేమం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడారు.
రైతులు సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలని, సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి పంట మార్పిడి విధానాలను పాటించాలని పిలుపునిచ్చారు. సేంద్రియ పంటల ఉత్పత్తుల నాణ్యత పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ప్రత్యేక విధివిధానాలను రూపొందిస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు అద్భుతమైన డిమాండ్ ఉందని, రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాములు నాయక్, కె.వి.ఎన్. రెడ్డి, భవానీ రెడ్డి, రామ్గోపాల్ రెడ్డి, సునీల్ కుమార్, గంగాధర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డి.ఎఫ్.ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

