జయశంకర్ సార్, గద్దర్ సేవలు చిరస్మరణీయం: మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ : తెలంగాణ అస్తిత్వం, సాధన కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) కొనియాడారు. గురువారం నల్లగొండలోని ఇందిరా భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి, గద్దర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఆయన పాత్ర మరువలేనిదని అన్నారు. అమరుల త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మంత్రి తెలిపారు. జయశంకర్ సార్ ఆశయాలను నెరవేర్చడమే నిజమైన నివాళి అని అన్నారు.

ఎస్ఎల్‌బీసీ పూర్తి చేసి సాగునీరు అందిస్తాం

శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ ఉన్నప్పటికీ నీటిని అందించేలా ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు రూపకల్పన చేశామని మంత్రి తెలిపారు. నిలిచిపోయిన సొరంగం పనులలో ఇప్పటికే 700 మీటర్ల పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 2028 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి దేవరకొండ నుంచి బ్రాహ్మణ వెల్లెంల వరకు నల్లగొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఎస్ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయడమే జయశంకర్ సార్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి పేర్కొన్నారు.

యువతకు ఉద్యోగ అవకాశాలపై దృష్టి

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి తెలిపారు. మరో 7 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలు, న్యాక్ సెంటర్ల ద్వారా యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత దాదాపు రూ.2 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి స్థానిక ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>