కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) విధానాన్ని ప్రస్తుతం కొన్ని జిల్లాల్లోనే అమలు చేస్తున్నామని, త్వరలో మరో 10 జిల్లాలకు విస్తరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswar Rao) తెలిపారు. గురువారం హ్యాండ్‌లూమ్ హాకథాన్-2026లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎరువుల విక్రయాలను డిజిటల్‌గా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రైతుల ఆధార్ వివరాలను నమోదు చేసుకుని, వారి భూ విస్తీర్ణానికి అనుగుణంగానే ఎరువులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ అధికారులకు ఎరువుల నిల్వలు, విక్రయాలపై రియల్‌టైమ్ సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, డీలర్లు అవసరానికి మించి నిల్వ చేయడం, అక్రమంగా మళ్లించడం వంటి చర్యలకు అడ్డుకట్ట పడుతుందని మంత్రి చెప్పారు.
జొన్న రైతులకు వెయ్యి కోట్లు
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రైతుల నుంచి జొన్నలను కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారమే సేకరణ చేపట్టామన్నారు. ఆ నగదును ఎప్పటికప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, రాష్ట్రంలో మొత్తం 1.01 లక్షల మంది రైతులకు రూ.994 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. జొన్న కొనుగోళ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
విజేతలకు సన్మానం
చేనేత శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న తుమ్మల.. ‘హ్యాండ్‌లూమ్ హాకథాన్-2026’ కార్యక్రమంలో పాల్గొని విజేతలను సన్మానించారు. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థి వగ్గు శ్రీరామ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా నేతన్నల కోసం రూపొందించిన ‘ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్’ పరికరాన్ని ఆవిష్కరించారు.

