ఎల్ నినో తీవ్రతరం.. రైతుకు బీమా రక్షణేది?

కలం, తెలంగాణ బ్యూరో: ఎల్‌ నినో వేళ రైతన్నను మరో కొత్త భయం వెంటాడుతున్నది. వర్షాభావంతో ఈ ఖరీఫ్‌ సీజన్లో దిగుబడి తగ్గొచ్చని తెలంగాణ ప్రభుత్వమే అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతూ, కరెంటు కోసం సబ్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న అన్నదాతకు.. రేపు పంట దెబ్బతింటే పంట బీమా (Crop Insurance) ద్వారా పరిహారం ఎక్కడి నుంచి వస్తుందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

రాష్ట్రంలో ప్రత్యేక పంటల బీమా పథకం లేదు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్‌ బీమా యోజనలో చేరుతామని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటికీ ఆ పథకంలో చేరలేదు. దీంతో ఎల్‌ నినో తీవ్రత పెరిగి పంట నష్టం జరిగితే రైతుకు బీమా రక్షణ లేకుండా పోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికింకా పంట నష్టం పెద్దగా చోటుచేసుకోకపోయినా.. వరి కోతల నాటికి పరిస్థితి ఎలా మారుతుందోనన్న టెన్షన్‌ రైతన్నల్లో నెలకొన్నది.

దేశవ్యాప్తంగా పెరిగిన దరఖాస్తులు

ఎల్‌ నినో, కరువు, సాగునీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఖరీఫ్ సీజన్‌లో ఫసల్‌ బీమా యోజన కింద దేశవ్యాప్తంగా రైతుల చేరిక పెరిగింది. గతేడాది 2.30 కోట్ల మంది రైతులు 8.50 కోట్ల దరఖాస్తులు సమర్పించగా.. ఈసారి 2.73 కోట్ల మంది రైతులు 10.32 కోట్ల దరఖాస్తులు చేశారు. అంటే 43 లక్షల మంది అదనంగా బీమా పరిధిలోకి వచ్చారు. పశ్చిమబెంగాల్‌ కూడా ఇటీవలే ఈ పథకంలో చేరింది. తెలంగాణ మాత్రం రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది. గత ఖరీఫ్‌లో 2.60 కోట్ల హెక్టార్ల పంట విస్తీర్ణం బీమా పరిధిలో ఉండగా.. ఈసారి మరో 25 లక్షల హెక్టార్లు పెరిగి 2.85 కోట్ల హెక్టార్లకు చేరింది. వెదర్‌ బేస్డ్‌ రీస్ట్రక్చర్డ్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను కలుపుకుంటే 2.97 కోట్ల హెక్టార్లకు చేరింది. ఇందులో దాదాపు 63 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. తెలంగాణ అధికారికంగా ఈ పథకంలో చేరకపోవడంతో రాష్ట్ర రైతులకు ఈ రక్షణ అందడం లేదు.

23 శాతం తగ్గనున్న వరి దిగుబడి?

బలహీనమైన రుతుపవనాలు, నీటి లభ్యత తగ్గడం, రిజర్వాయర్లలో నిల్వలు పెరగకపోవడంతో రాష్ట్ర వ్యవసాయశాఖ కంటింజెన్సీ ప్లాన్‌ రూపొందించింది. తక్కువ నీటితో పండే, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలకు మారాలని రైతులకు సూచించింది. ఎల్‌ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ రూ.802.92 కోట్ల కంటింజెన్సీ ప్యాకేజీని సూచించడంతోపాటు పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలని ప్రతిపాదించింది. గత ఖరీఫ్‌లో 70 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈసారి 57 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 154 లక్షల టన్నుల దిగుబడి వచ్చిన గతేడాదితో పోలిస్తే ఈసారి 1.20 కోట్ల టన్నుల్లోపే దిగుబడి ఉండొచ్చని అంచనా. అందుకే ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 85 లక్షల టన్నుల నుంచి 65 లక్షల టన్నులకు తగ్గించారు. మొత్తంగా వరి దిగుబడి దాదాపు 23 శాతం తగ్గే అవకాశం కనిపిస్తున్నది.

ప్రకృతి విపత్తుగా ప్రకటిస్తేనే సాయం

పంట బీమా లేకపోవడంతో నష్టపరిహారం పొందేందుకు రైతన్న మరో మార్గం ప్రకృతి విపత్తు సాయమే. పంట నష్టం 33 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వ్యవసాయ ఇన్పుట్‌ సబ్సిడీకి అర్హత ఉంటుంది. ఇందుకోసం రెవెన్యూ, వ్యవసాయశాఖలు నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించాలి. ఆ తర్వాత కేంద్ర బృందాల పరిశీలన, నివేదిక ఆధారంగా ఎన్డీఆర్ఎఫ్‌ నుంచి సాయం అందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ నిధి తక్షణ ఉపశమనానికే పరిమితం. రైతు పెట్టిన మొత్తం పెట్టుబడిని భర్తీ చేసే స్థాయిలో ఉండదు. ఎల్‌ నినో ప్రభావంతో కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కరువు మండలాల జాబితాను కేంద్రానికి పంపినా.. తెలంగాణలో ఇప్పటివరకు అలాంటి ప్రక్రియ మొదలుకాలేదు.

కేంద్రం సాయంపై ఆశలు

ఎల్‌ నినో వల్ల జరిగిన నష్టంపై కేంద్ర సాయం కోరాలని అక్టోబర్‌ 1న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నష్టం అంచనా కోసం కేబినెట్‌ సబ్ కమిటీని ఏర్పాటు చేసి.. దాని నివేదిక ఆధారంగా కేంద్రాన్ని సాయం కోరనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్షాభావం, నీటి కొరత, పంట విస్తీర్ణం తగ్గడం, దిగుబడి అంచనాలు పడిపోవడం వంటి పరిణామాలతో రైతులకు నష్టం తప్పదన్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే రాష్ట్రంలో పంట బీమా లేకపోవడం, ఫసల్‌ బీమాలో తెలంగాణ చేరకపోవడంతో నష్టం జరిగితే రైతులకు అందే భరోసా ఏమిటన్నది ప్రశ్నగా మారింది. కేంద్ర సాయంపై రాష్ట్రం ఎలాంటి ప్రతిపాదన పంపుతుంది? ఎంత మేరకు ఉపశమనం లభిస్తుంది? అన్నదే ఇప్పుడు కీలకం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>