Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుల‌కు నీళ్లు అందించ‌డ‌మే ల‌క్ష్యం: ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు

కలం, ఖమ్మం బ్యూరో: ఈ నెలాఖరుకల్లా మరేళ్లపాడు నీళ్లు పారాల్సిందేనని, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు సకాలంలో నీరందించడమే ప్రభుత్వ ల‌క్ష్య‌మ‌ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (MLA Payam Venkateshwarlu) అధికారులకు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మరేళ్లపాడు ప్రాజెక్టుతో పాటు కుడి కాల్వ నిర్మాణ పనులను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాల్వ నిర్మాణ పనుల పురోగతిని, సాంకేతిక వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, సీతారామ ప్రాజెక్టు పరిధిలోని మరేళ్లపాడు ప్రాజెక్టు కుడి కాల్వ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

​నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదని, వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే ఆయకట్టు పరిధిలోని రైతులకు సకాలంలో సాగునీరు అందుతుందని తెలిపారు. తద్వారా ఈ ప్రాంతంలో వ్యవసాయరంగం అభివృద్ధి చెంది రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ అధికారులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>