జర్నలిస్టులకు అలర్ట్.. అక్రిడిటేషన్ గడువు మరోసారి పొడిగింపు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ (Journalist Accreditation) కార్డులకు సంబంధించిన నిబంధనలు (జీఓ 252, జీఓ 103) సవరణలను సవాలు చేస్తూ తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TUWJF) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అక్రిడిటేషన్ కార్డుల గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించనున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది అడ్వొకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఓల వల్ల జర్నలిస్టుల హక్కులు, సౌకర్యాలకు విఘాతం కలుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన స్పెషల్ అడ్వకేట్ జనరల్ జర్నలిస్టులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా రెండు నెలల పాటు గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ నిర్ణయాన్ని వివరించారు. ఈ వివరణను రికార్డుల్లోకి తీసుకున్న ధర్మాసనం గడువు పొడిగింపును ధ్రువీకరించింది.

ప్రభుత్వ నిబంధనలపై ఉన్న అభ్యంతరాలపై పూర్తి స్థాయి వివరణ సమర్పించాలని హైకోర్టు (High Court) ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని పేర్కొంటూ, తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడిటెడ్ జర్నలిస్టులు ఏప్రిల్ నెలాఖరు వరకు ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర సౌకర్యాలను యథావిధిగా పొందవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>