కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయడం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ జేఏసీ నేతలు శుక్రవారం జరిపిన చర్చల అనంతరం ఆయన కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక, ఉద్యోగ భద్రత, సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పాటు ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రభుత్వం సానూకూలంగా స్పందిస్తూ.. కార్మిక సంఘాలతో నిరంతరం చర్చలు కొనసాగిస్తోందని పొన్నం వెల్లడించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఉద్యోగ భద్రత, వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని, కార్మికులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఆర్టీసీని ఆర్థికంగా బలపరచడం కూడా అంతే ముఖ్యమన్నారు. సంస్థ బలపడితేనే ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుతాయని.. దీని కోసమే కార్మికుల సంక్షేమంతో పాటు ఆర్టీసీ అభివృద్ధి అనే రెండు లక్ష్యాలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి పొన్నం (Minister Ponnam) స్పష్టం చేశారు.

