కలం, నల్లగొండ బ్యూరో: కోదాడ (Kodad), హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని ఆర్అండ్ బీ రహదారులకు మహర్దశ పట్టనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 49 కిలోమీటర్ల మేర సింగిల్ రహదారులను డబుల్ రోడ్లుగా (Double Road Projects) ఏర్పాటుచేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగానే రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలో రూ.62 కోట్లతో 26.50 కిలోమీటర్ల పొడవున డబల్ రోడ్డు మంజూరు పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా ఈ నియోజకవర్గంలో 15 గ్రామాలకు ప్రయాణ సౌకర్యం సులువుగా మారనుంది. అదేవిధంగా కోదాడ నియోజకవర్గ పరిధిలో రూ.68 కోట్లతో 22.60 కిలోమీటర్ల పొడవున డబుల్ రోడ్డు ఏర్పాటుకు అనుమతులు లభించాయి. తద్వారా నియోజకవర్గంలోని 9 గ్రామాలకు రాక పోకలు సులువు కానున్నాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రూ.32 కోట్లతో చింతలపాలెం నుంచి కిష్టాపురం వరకు 9.20 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ నుంచి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో చింతలపాలెం, శోభనాద్రిగూడెం, అడ్లూరు, తమ్మారం, కొత్తూరు, కిస్టాపురం గ్రామ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
అదేవిధంగా రామలక్ష్మిపురం నుంచి హుజూర్ నగర్ (Huzurnagar) బైపాస్ రోడ్డు వరకు 3.80 కీమీల మేర సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీంతో రామలక్ష్మిపురం, యర్రారం, హుజూర్ నగర్ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. మరోవైపు రూ.30 కోట్లతో అమరవరం నుంచి కొత్త తండా వరకు 5.50 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో అమరవరం, అంజలిపురం తండా, కొత్తతండా ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. గుడుగుంట్ల పాలెం నుంచి ఎల్లాపురం వరకు 8 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ నుంచి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో గుడుగుంట్ల పాలెం, ముసిఒడ్డు సింగారం, ఎల్లాపురం గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
కోదాడ నియోజకవర్గంలో ఇలా..
కోదాడ నియోజకవర్గం పరిధిలో రూ.30 కోట్లతో కోదాడ (Kodad) నుంచి అనంతగిరి వరకు 6.60 కిలోమీటర్ల మేర ఏడు మీటర్ల నుండి పది మీటర్ల మేర వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో కోదాడ, ఖానాపురం, అనంతగిరి గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. రూ.24 కోట్లతో ఎన్‌హెచ్ 9 నుంచి నేలమర్రి వరకు 10 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ నుంచి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం (Double Road Projects) చేయనున్నారు. దీనితో తాడ్వాయి తండా, తాడ్వాయి, వెంకట్రాంపురం, నేలమర్రి గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా రూ.14 కోట్లతో కాపుగల్లు నుంచి దోరకుంట వరకు 6కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ నుంచి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో కాపుగల్లు, దోరకుంట ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ కంప్లీట్ కానుంది.
Read Also: సివిల్స్‌లో తెలంగాణ అభ్యర్థుల సత్తా.. సీఎం రేవంత్ అభినందనలు
Follow Us On: Facebook

