కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ (Musi Rejuvenation) పథకానికి కసరత్తు ప్రారంభించింది. అందులో తొలి స్టెప్‌గా భూ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూ సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఫేజ్-1 లో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 9.2 కి.మీ. మేర, సెకండ్ ఫేజ్‌లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 11.8 కి.మీ. మేర భూ సేకరణ జరగనున్నది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలంలో భూ సేకరణ ప్రక్రియ జరగనున్నది. సుమారు యాభై ఎకరాలకు పైగా భూమిని కార్పొరేషన్ సేకరించనున్నది. ఏయే సర్వే నెంబర్లలో భూమిని సేకరించనున్నది కూడా కార్పొరేషన్ వెల్లడించింది.
46 గ్రామాల్లో 55 కి.మీ. మేర డెవలప్‌మెంట్ :
భూసేకరణ చట్టం 2013 ప్రకారం కార్పొరేషన్ ఈ ప్రాజెక్టు కోసం భూమిని సేకరించనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దశలవారీగా మూసి అభివృద్ధి పనులు (Musi Rejuvenation) జరగనున్నాయి. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మొత్తం 14 మండలాల్లోని 40 గ్రామాల పరిధిలో 55 కి.మీ. మేర ఈ పనులు ఉంటాయి. భూసేకరణలో భాగంగా భూములు కోల్పోతున్న యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా కార్పొరేషన్ పరిహారం చెల్లించనున్నది. ఇందుకోసం ఆ యజమానులు వారి భూమి హక్కుల పత్రాల (భూమి పట్టా, ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్) వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొన్న టైమ్‌లోగా సమర్పించాలని ఆ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అభ్యంతరాలున్నట్లయితే కార్యాలయంలో సంప్రదించి తెలియజేయవచ్చునని సూచించింది.
Read Also: నల్లగొండలో నకిలీ ఓట్ల కలకలం
Follow Us On: Pinterest


