రైతుల‌కు సీఎం రేవంత్ కీల‌క విజ్ఞప్తి

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎల్ నినోతో రానున్న 8 నెల‌లు తీవ్ర క‌రువు ప‌రిస్థితులు ఎదుర్కోబోతున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ సన్నాహక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న‌ ద‌శాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రం వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ రూపొందిస్తోంది. జల వనరుల పరిరక్షణతో పాటు స్వచ్ఛ ఇంధనం, పటిష్టమైన వ్యవసాయానికి సమగ్ర ప్రణాళిక త‌యారు చేయ‌నున్నారు. ఈ మేర‌కు డిసెంబ‌ర్ 7 నుంచి 9 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్ నిర్వ‌హించ‌నున్నారు. వాతావరణ సవాళ్లు, జల వనరుల సంరక్షణ, సుస్థిర పరిష్కారాలపై చర్చించేందుకు నిపుణులు, విధాన నిర్ణేతలు, వివిధ రంగాల ప్రతినిధులు ఒకే వేదికపైకి రానున్నారు. దీనికి సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమంలో నేడు సీఎం పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే 8 నెలల పాటు తీవ్రమైన నీటి క‌రువు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది కరోనా మహమ్మారి లాంటి విపత్తేనని, దీనిని అంద‌రం క‌లిసి సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వానికి రైతులే తొలి ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండేళ్లకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం రాబోయేది తిండి గింజల కరువు కాదని, కేవలం నీటి కరువు మాత్రమేనని వివరించారు. నీటి కొరతను అధిగమించేందుకు రైతులు దయచేసి ఒక పంటను త్యాగం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలోని ప్రతి గ్రామానికి చెరువులు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలోనూ వందల సంఖ్యలో చెరువులు ఉండేవని సీఎం గుర్తు చేశారు. కబ్జాల వల్ల నగరంలో ఎన్నో చెరువులు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీరు వెళ్లే మార్గాలు, చెరువులను ఆక్రమించి ఇళ్లు నిర్మించడం వల్లే వర్షాకాలంలో వరదలు ముంచెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడేందుకే హైడ్రాను తీసుకువచ్చామన్నారు. హైడ్రాతో ఎవరి పట్టా భూములను గుంజుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే బతుకమ్మ కుంట, తుమ్మిడి కుంటను పునరుద్ధరించామని, ఎన్ని విమర్శలు వచ్చినా హైడ్రా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. డ్ర‌గ్స్‌ దందాలో ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని స్ప‌ష్టం చేశారు. కచ్చితంగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అదే విధంగా ప్రజల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఆహార భద్రత విషయంలోనూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. టీజీసేఫ్ ఆధ్వ‌ర్యంలో త‌ర‌చూ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భ‌ద్ర‌తా త‌నిఖీలు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>