కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని అంగన్వాడీ (Anganwadi) కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో అంగన్‌వాడీ కేంద్రాలను హాఫ్‌డే పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అంగన్ వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు (Half Day) పనిచేస్తాయి. అలాగే మే 1 నుంచి మే 31 వరకు అంగన్ వాడీ పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇదే కాలంలో అంగన్‌వాడీ టీచర్లు హెల్పర్లకు సెలవులు మంజూరు చేశారు.
అయితే సెలవుల సమయంలో అంగన్‌వాడీ సిబ్బంది కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటిలో భాగంగా పిల్లలకు టేక్ హోమ్ రేషన్ (THR) పంపిణీ చేయాలి. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో అభివృద్ధి లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఇంటింటా సర్వేలు నిర్వహించాలి. ప్రీ-స్కూల్‌లో పిల్లల నమోదు, డ్రాప్‌ఔట్ అయిన పిల్లలను మళ్లీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చేవిధంగా చర్యలు చేపట్టాలి. వేసవి సెలవుల్లో అంగన్వాడీ సిబ్బంది తాము నిర్వహించిన కార్యకలాపాలపై సమగ్ర నివేదిక సమర్పించాలి. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు జరిగే ‘చైల్డ్ సేఫ్టీ వీక్’, మే 25 నుంచి మే 30 వరకు నిర్వహించే ‘ఉమెన్ థీమ్ వీక్’ కార్యక్రమాల్లో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొనాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీతక్కను కలిసిన అంగన్‌వాడీ టీచర్స్
సమ్మర్ హాలిడేస్ ప్రకటించినందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను అంగన్‌వాడీ టీచర్స్ ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (INTUC) నాయకురాలు ఇందిరా ప్రియదర్శిని సీఎం రేవంత్, సీతక్కకు థ్యాంక్స్ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకుగాను ప్రభుత్వానికి రుణపడి ఉంటామని రాష్ట్ర అధ్యక్షురాలు డి. అన్నపూర్ణ అన్నారు.

