తెలంగాణ ప్రజలకు గవర్నర్ కీలక సందేశం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో 2027 జనాభా లెక్కల (సెన్సెస్) తొలి విడత ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ (Telangana Governor) శివ ప్రతాప్ శుక్లా ఆన్‌లైన్ లో స్వీయ నమోదు ద్వారా తన వివరాలను నమోదు చేసి తెలంగాణలో Census of India-2027 కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. జనాభా గణన అనేది ఒక కీలకమైన జాతీయ కార్యక్రమం అని.. ఇది మన జనాభా , వారి సామాజిక-ఆర్థిక స్థితిపై సమగ్రమైన చిత్రాన్ని అందిస్తుందని చెప్పారు. ఇది ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాది అని వెల్లడించారు. దీని ద్వారా అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరుతాయని పేర్కొన్నారు.

విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన విధానాలను రూపొందించడంలోనూ.. సంక్షేమ, జాతీయ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి స్వీయ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి , పురోగతికి కచ్చితమైన సమాచార సేకరణ చాలా కీలకమని వ్యాఖ్యానించారు. స్వీయ గణన అనేది ఒక నూతనమైన, ప్రగతిశీలమైన వ్యవస్థ అని.. దీని ద్వారా కుటుంబాలు తమ వివరాలను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చని వివరించారు. పారదర్శకతతో కూడిన స్వీయ నమోదు దశ ఏప్రిల్ 26, 2026 నుంచి మే 10, 2026 వరకు ఉంటుందని, మే 11, 2026 నుంచి జూన్ 9, 2026 వరకు హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ (హెచ్‌ఎల్‌వో) ను అధికారులు చేస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖచ్చితమైన, సమగ్రమైన జనాభా లెక్కల కోసం ప్రతి కుటుంబం భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఏ ఒక్క ఇల్లూ లెక్కల్లోంచి తప్పిపోకూడదన్నారు. https://se.census.gov.in వెబ్ పోర్టల్ లో వివరాలు ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్వీయ గణన ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>