కలం, వెబ్ డెస్క్: రాయదుర్గం భూముల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక నుంచి ఆ బ్యాంకుతో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను నిలిపివేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంక్ అధికారులు కోరినట్లు సమాచారం. ఆర్థిక సంబంధాలను వెంటనే తొలగించుకోవడంతో పాటు డిపాజిట్లను కూడా వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్‌ను కోరినట్లు వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ తీరుపై సీఎస్ మండిపడినట్లు తెలుస్తోంది. భూమి విషయంలో అవగాహన అంశాలను వారి ముందు పెట్టి ప్రశ్నించినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంక్షల విషయంలో మాత్రం సీఎస్ నుంచి వారికి ఎలాంటి హామీ లభించలేదని చెబుతున్నారు.

