కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని కొన్ని కులాల పేర్లు మారుస్తూ (Caste Names Changes) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల (బీసీ) చిరకాల వాంఛను నెరవేరుస్తూ ప్రభుత్వం కీలకమైన సామాజిక సంస్కరణకు అడుగులు వేసింది. బీసీ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కించపరిచే విధంగా ఉన్న కులాల పేర్లు, సామాజికంగా గౌరవప్రదంగా లేని వాటి పేర్లను తొలగించింది. అలాగే, మరికొన్ని కులాలకు గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తక్షణమే ఈ మార్పులు అమలులోకి వస్తాయని గెజిట్ విడుదల చేసింది. ఇకపై విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ సర్టిఫికేట్లలో ఈ కొత్త పేర్లను ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా బీసీ గ్రూప్ – ఏ, బీసీ-డీ లోని కులాల పేర్లలో మార్పులు, చేర్పులు చేసింది.
సామాజికంగా అసభ్యకరంగా పిలవబడుతున్న ‘దొమ్మర’ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించింది. దీని స్థానంలో ‘గడ వంశీయ’ అనే పేరుగా మార్చింది. ‘పిచ్చకుంట్ల’ అనే పేరును ఇక నుంచి ‘వంశ రాజ్’ గా ఖరారు చేసిన ప్రభుత్వం. బుడబుక్కల కులానికి శివ క్షత్రియ అనే పదాన్ని చేర్చింది. వీర భద్రియ కులానికి వారి విన్నపం మేరకు వీరముష్టి, నెట్టి కోటలను పర్యాయపదాలుగా చేర్చింది. రజక, చాకలి వర్గాలకు మరింత స్పష్టమైన సామాజిక గుర్తింపును అందించడానికి ‘ధోబీ’ అనే పదాన్ని చేర్చింది. బీసీ- డీ లో ఉన్న ‘శూద్ర కులం’ అనే పేరును శాశ్వతంగా తొలగించింది. దీని స్థానంలో ‘తమ్మలి’ అనే పేరును సూచిస్తూ గుర్తింపునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో ఆయా కులాల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల
Follow Us On: WhatsApp

