కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో వైద్య విద్యకు సంబంధించిన పీజీ కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, కింగ్ కోటి, పటాన్‌చెరు ఆసుపత్రులతో పాటు గిరిజన ప్రాంతాల్లోని ఎంతో కీలకమైన భద్రాచలం (Bhadrachalam) ఏరియా ఆసుపత్రి కూడా ఎంపిక కావడం ఏజెన్సీ ప్రజలకు ఒక వరమని చెప్పచ్చు.
భద్రాచలం (Bhadrachalam) ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాలలో ప్రతి విభాగానికి 4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా టీవీవీపీ(తెలంగాణ వైద్య విధాన పరిషత్)కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు, శనివారం డీసీహెచ్ఎస్ డాక్టర్ జి. రవి బాబు ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎమ్ఈ) కార్యాలయానికి పిలిపించి, సంబంధిత ఆసుపత్రికి అవసరమైన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. అలాగే నేడు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చర్యలు కూడా పూర్తిచేయగా, దరఖాస్తును సోమవారం సమర్పించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తూ, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పీజీ కోర్సులు ప్రారంభించేందుకు విశేష కృషి చేస్తున్నదని, ఇది భద్రాచలం పరిసర గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందించడమే కాకుండా, వైద్య విద్యలో ఒక పెద్ద ముందడుగుగా నిలుస్తుందని, ఫలితంగా స్పెషలిస్ట్ వైద్యులు , అత్యాధునిక వైద్య సదుపాయాలు, పరికరాలు, నూతన సేవల లభ్యత పెరగడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.రవి బాబు తెలిపారు.

