Mobile Popup Ad
Mobile Popup Ad

సామాజిక బాధ్యతతోనే అమరవీరులకు నిజమైన నివాళి: వీసీ అల్తాఫ్ హుస్సేన్

కలం, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సాధన అనేది దశాబ్దాల త్యాగాలు, పోరాటాలు, అమరుల రక్తంతో లభించిన చారిత్రాత్మక విజయమని వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ (Khaja Altaf Hussain) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) వేడుకలను నల్గొండ (Nalgonda) జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు, విశ్వవిద్యాలయ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం హుస్సేన్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ, వారి త్యాగాలు వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర, దేశ ప్రగతి కోసం ప్రతి పౌరుడూ నూతన సంకల్పంతో బాధ్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాలకు నిజమైన గౌరవం ఇవ్వడం అంటే కేవలం జయంతులు, వేడుకలు జరుపుకోవడం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పనిలో స్వీయ క్రమశిక్షణ, సున్నితత్వం, సామాజిక బాధ్యత, నిజాయితీని అలవర్చుకోవడమే వారికిచ్చే అసలైన నివాళి అన్నారు. యువతలో విలువల ఆధారిత విద్య, శ్రమ పట్ల గౌరవం, సేవాభావం పెంపొందినప్పుడే తెలంగాణ పురోగతి సాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి అనే లక్ష్యాలను మన రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమర జ్యోతి మనందరికీ నిరంతరం దారిదీపంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డితో పాటు ఆచార్య ఆకుల రవి, ఆచార్య రేఖ, ఆచార్య వసంత, ఆచార్య శ్రీదేవి, ఆచార్య అలువాల రవి, డా. జి. ఉపేందర్, డా. మిరియాల రమేష్, డా. వెంకటరమణారెడ్డి, డా. ప్రశాంతి, డా. మురళి, డా. శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధ్యాపకులు, అధికారులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>