Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ బాధ్యతను హైడ్రాకు అప్పగించాం: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : హైడ్రా ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ అనే పేరుందన్న సీఎం.. ఇప్పుడు అవి కనిపించడం లేదని చెప్పారు. అయితే కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న సరస్సులు, చెరువులు, ట్యాంకులను పునరుద్ధరించే బాధ్యతను హైడ్రాకు అప్పగించామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన 1045 ఎకరాలకు పైగా ఆక్రమణ, కబ్జాలకు గురైన చెరువు భూములు, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఇకపై అవి ప్రజల ఆస్తి అని చెప్పారు.

ఇదిలాఉంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం తన ఆస్తులను అమ్ముకోవడమే తప్ప కొత్త ఆస్తులను సృష్టించింది లేదని సీఎం అన్నారు. అయితే ప్రజా ప్రభుత్వం ఆ పద్ధతికి స్వస్తి చెప్పిందని చెప్పారు. తొలి సారి ప్రైవేటు నుంచి ఆస్తులను ప్రభుత్వ పరం.. అంటే ప్రజల ఆస్తిగా మార్చామని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి కొనుగోలు చేసి, ప్రజల ఆస్తిగా మార్చామని చెప్పారు. ఫేజ్ 2 లో ఏడు కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించే ప్రతిపాదనలతో తయారు చేసిన డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని తెలియజేశారు.

హైదరాబాద్ స్వచ్ఛమైన, పర్యావరణహితమైన నగరంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఉపాధి, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం మిళితమైన అభివృద్ధి అవసరమైనే ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్-1 ప్రాజెక్టుగా మూసీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. మూసీ ప్రాజెక్టులో భాగంగానే గోదావరి ఫేజ్ -2, ఫేజ్`3 పనులు వేగంగా జరుగుతున్నాయన్న సీఎం… గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు అనుసంధానించి 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు తరలిస్తారని వివరించారు. దీంతో హైదరాబాద్ సిటీలో సరిపడే తాగునీరు అందుతుంది.

రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం

హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మించుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రెండింటి మధ్య ఉన్న ప్యూర్ (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ) ప్రాంతాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, మాన్యూఫాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎకో-ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయటం ద్వారా రీజనల్ కనెక్టివిటీ బలోపేతం అవుతుందని చెప్పారు.

తెలంగాణ టాప్ అచీవర్

కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంచనాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్ అచీవర్ గా నిలవడం హర్షణీయం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) హబ్ గా మారుతుందని చెప్పారు. దేశంలోని జీసీసీల్లో దాదాపు 20 శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తెలంగాణ టూరిజం పాలసీని రూపొందించుకున్నామని పేర్కొన్నారు. దీంతో దాదాపు మూడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.

పలు విమానాశ్రయాల ఏర్పాటు

రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు మనం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆమోదం పొందామని సీఎం చెప్పారు. ఈ విమానాశ్రయాలను వేగంగా నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన మొత్తం 950 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించిందని వివరించారు. త్వరలోనే ఈ ఎయిర్ పోర్ట్ అభివృద్ది పనులు ప్రారంభమవుతాయన్నారు.

అదే ప్రజా ప్రభుత్వ సంకల్పం

తెలంగాణ 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఉండాలన్నది ప్రజా ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా 2030 నాటికి తెలంగాణ టాప్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలబెట్టాలనేది లక్ష్యమని చెప్పారు. దానికి తెలంగాణ రైజింగ్ – 2047 డాక్యుమెంట్ ఓ మార్గమని వెల్లడించారు. లక్ష్యసాధనలో ప్రజల అండదండలు, సహకారం కావాలని కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>