కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి తుమ్మల జిల్లా కలెక్టర్, ఎస్పీ రోహిత్ రాజ్‌తో కలిసి అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఎందరో అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని తెలిపారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఐదు నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి కోసం చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌కు రెండో జాతీయ రహదారి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

