కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే “చేప ప్రసాదం” (Fish Prasadam) కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రేపటి నుంచి రెండు రోజుల పాటు పంపిణీ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. వాహనదారులు ఈ మళ్లింపులు గమనించి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు.
వాహనాల పార్కింగ్ ఎక్కడంటే..
1. ఫోర్ వీలర్ వాహనాలు: నాంపల్లి వైపు నుంచి చేప ప్రసాదం కోసం ఫోర్ వీలర్ వాహనాల్లో వచ్చే వారు గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్‌లో పార్క్ చేయాలి. అక్కడి నుంచి కాలినడకన ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్ నెం.2 వైపునకు వెళ్లాల్సి ఉంటుంది.
2. బస్సులు, వ్యాన్లు: ఎం.జె. మార్కెట్ వైపు నుంచి బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీ భవన్ బస్ స్టాప్ వద్ద దిగాలి. నాంపల్లి నుంచి వచ్చే వారు గృహకల్ప బస్ స్టాప్ వద్ద దిగి, అక్కడి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్ నెం.2 వైపునకు వెళ్లాలి.
3. వీఐపీ కార్ పాస్ ఉన్నవారు: ఎం.జె. మార్కెట్ నుంచి వచ్చే వారు గాంధీ భవన్ వైపునకు వెళ్లి, అదాబ్ హోటల్ లేన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని గేట్ నెం.1, CWC గేట్ మీదుగా వీఐపీ ఎంట్రీ గేట్ వైపునకు వెళ్లాలి. నాంపల్లి నుంచి వచ్చే వారరు గాంధీ భవన్ వద్ద యూ టర్న్ తీసుకుని, గేట్ నెం.1, CWC గేట్ వైపు ఎడమ మలుపు తీసుకుని వీఐపీ ఎంట్రీ గేట్ వైపునకు వెళ్లాలి. వాహనాలను వీఐపీ పార్కింగ్ ఏరియాలోనే నిలపాలి.
4. బైక్‌లపై వచ్చేవారు: ఎం.జె. మార్కెట్ నుంచి వచ్చే వారు మనోరంజన్ కాంప్లెక్స్ పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేయాలి. నాంపల్లి నుంచి వచ్చే వారు షెజాన్ హోటల్ పక్కన ఉన్న భీమ్‌రావ్ బాడాలో ఎడమవైపున పార్క్ చేయాలి.
5. ఆటోలో వచ్చేవారు: షెజాన్ హోటల్ ఎదురుగా దిగేలా ఏర్పాట్లు చేశారు.
6. ప్రభుత్వ వాహనాలు: CWC పార్కింగ్‌లో వాహనాలు నిలిపి ఉంచాలి.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
1. ఎం.జె. మార్కెట్ వైపు నుంచి వచ్చే వాహనాలను అబిడ్స్, GPO నాంపల్లి వైపునకు మళ్లిస్తారు.
2. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేపలను తీసుకొచ్చే మత్స్య శాఖ వాహనాలను, జల మండలి నీటి ట్యాంకర్లను గేట్ నెం.3 ద్వారా అనుమతిస్తారు.
3. పాస్‌లు ఉండి, ఆహార సామగ్రిని తీసుకువెళ్లే స్వచ్ఛంద సంస్థల వాహనాలను గేట్ నెం. 3 నుంచి అనుమతిస్తారు.
4. ఎం.జె. బ్రిడ్జి, బేగం బజార్ ఛత్రి వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అలాస్కా వద్ద దారుస్సలాం, ఏక్ మినార్ మొదలైన ప్రాంతాల వైపునకు మళ్లిస్తారు.
5. ప్రైవేట్ ట్రావెల్స్, భారీ వాహనాలను ఎం.జె. మార్కెట్ వద్ద GPO వైపునకు, ఏ.ఆర్.పెట్రోల్ పంప్ వద్ద జీపీవో వైపునకు మళ్లిస్తారు.
6. ప్రైవేట్ ట్రావెల్స్, భారీ వాహనాలను ఎం.జె. మార్కెట్ నుంచి తాజ్ ఐలాండ్ వైపునకు, అలాగే తాజ్ ఐలాండ్ నుంచి ఎం.జె. మార్కెట్ వైపునకు అనుమతించరు.

