చైనా ఓపెన్: పీవీ సింధు, ఆయుష్ శెట్టి సంచలన విజయాలు!

కలం, స్పోర్ట్స్​ : జపాన్ ఓపెన్ టైటిల్‌తో మంచి ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) చైనా ఓపెన్‌ (China Open) లోనూ తన విజయపరంపరను కొనసాగించారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో విజయం సాధించి ఆమె తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. అదే సమయంలో యువ ఆటగాడు ఆయుష్ శెట్టి భారీ విజయాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పీవీ సింధు, తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన ఉన్నతి హుడాతో తలపడ్డారు.

56 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-14, 9-21, 21-10 తేడాతో విజయం సాధించారు. గత ఏడాది చైనా ఓపెన్‌లో ఉన్నతి చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో సింధు బదులు తీర్చుకున్నారు. రెండవ గేమ్‌ను కోల్పోయినప్పటికీ, నిర్ణయాత్మక మూడవ గేమ్‌లో పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. తదుపరి రౌండ్‌లో సింధు, నాలుగో సీడ్ చైనా క్రీడాకారిణి చెన్ యుఫీతో పోటీ పడనున్నారు.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి అద్భుత ప్రదర్శన చేశారు. ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ అల్వి ఫర్హాన్‌ను 21-17, 5-21, 21-17 తేడాతో ఓడించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. 2023 ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో ఫర్హాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఆయుష్ ఈ గెలుపుతో చెక్ పెట్టారు. సింగిల్స్‌లో శుభారంభం లభించినప్పటికీ, భారత డబుల్స్ విభాగంలో నిరాశే ఎదురైంది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్ – రుత్విక శివాని జోడీ, ధృవ్ కపిల – తనీషా క్రాస్టో జంట తమ మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో ఎం.ఆర్. అర్జున్ – హరిహరన్ జోడీ కూడా పరాజయం పాలవ్వడంతో డబుల్స్‌లో భారత పోరు ముగిసింది. బుధవారం చివర్లో జరిగే మ్యాచ్‌లో లక్ష్య సేన్ తన పోరును ప్రారంభించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>