కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) లో ప్రయాణికులు, వాహనదారులకు త్వరలోనే ట్రాఫిక్ తిప్పల నుంచి పెద్ద ఉపశమనం లభించనుంది. గోదావరి నదిపై నిర్మించిన కొత్త వంతెన అప్రోచ్ రోడ్డు, అలాగే వరద నీటి వల్ల మట్టి జారకుండా చేపడుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఈ నెలలోనే వేగవంతంగా పూర్తి చేసి రాకపోకలను పునఃప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావుతో కలసి ఆయన బుధవారం క్షేత్రస్థాయిలో నూతన వంతెన పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి వరదల ప్రభావంతో వంతెన వద్ద మట్టి కోతకు గురికాకుండా ఉండేందుకే శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ కడుతున్నామని వివరించారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి ఈ నెలలోనే బ్రిడ్జిని ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులతో పాటు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రయాణించే రహదారిపై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ, సారపాక సర్పంచ్ భూక్యా కిషోర్ నాయక్, తదితర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

