కొత్త ఇన్‌చార్జి సందీప్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర నూతన ఏఐసీసీ కార్యదర్శి, ఇన్‌చార్జి బీఎం సందీప్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి నిన్న అర్ధరాత్రి ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం, పార్టీ నాయకత్వంపై వీరిద్దరూ చేస్తున్న బహిరంగ విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు ఈ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో భాగంగా తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, నిధుల విడుదలలో జాప్యం, పార్టీలో ప్రస్తుత పరిస్థితులను ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్‌చార్జి సందీప్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సందీప్, అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తనతో చర్చించాలే తప్ప పార్టీని, ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలంటే నేతలంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ఇన్‌చార్జి సూచనలతో ఏకీభవించిన రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఇకపై పార్టీకి నష్టం కలిగించేలా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, పార్టీలో వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సందీప్ భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>