కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి సమీపంలోని రథం గుట్ట వద్ద ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో క్లోరిన్ గ్యాస్ లీకేజ్ (Chlorine Gas Leak) ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత మూడు రోజులుగా గ్యాస్ లీక్ అవుతున్నప్పటికీ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ అటవీ ప్రాంతంలో ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు భావిస్తున్నారు.
అయితే ఈ విషవాయువు ప్రభావంతో పరిసర ప్రాంతాల్లోని పాములు, కప్పలు, పలు కీటకాలు, పక్షులు మృత్యువాత పడ్డాయని, మొక్కలు, చెట్లు పూర్తిగా మాడిపోయి అక్కడి పరిస్థితి మారిపోయిందని సమాచారం. ఇప్పటికే క్లోరిన్ గ్యాస్ పీల్చుకుని ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న సిలిండర్‌ను బయట కెనాల్లో పడేశారన్న నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల పొలాలకు వెళ్లే వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
క్లోరిన్ అత్యంత ప్రమాదకరమైన విషపూరిత రసాయన వాయువు అని, ఇది గాలి కంటే బరువుగా ఉండటం వల్ల ఏ దిశలో కదిలినా సమీప ప్రాంతాల్లోని ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్యాస్ పీల్చడం వల్ల కళ్ల వెంట నీరు కారడం, ముక్కులు మూసుకుపోవడం , పల్మనరీ ఎడిమా వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
మరోవైపు, లీకేజ్ జరిగిన ప్రాంతంలో సాధారణ మాస్కులు కాకుండా సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్ వంటి పరికరాలతో శిక్షణ పొందిన నిపుణులు మాత్రమే లీకేజ్ అరికట్టాలని, అలాగే ప్లాంట్‌లో లీక్ డిటెక్షన్, అబ్సార్ప్షన్ వ్యవస్థలు ఉన్నాయా లేదా, ఎలాంటి సాంకేతిక ఏర్పాట్లు అమలు చేస్తున్నారనే అంశాలపై స్పష్టత లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి గ్యాస్ లీకేజ్‌ను పూర్తిగా అరికట్టాలని, సమీప గ్రామాల ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

