కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) పట్టణంలోని 7వ డివిజన్ వనమా కాలనీ వాసులు తాగునీటి సమస్య (Water Crisis) తో ఇబ్బందులు పడుతున్నారు. నివాసితులు తమ ఇళ్లలో బోర్లు వేసుకోకుండా అటవీశాఖ అధికారులు సృష్టిస్తున్న అడ్డంకులను వెంటనే తొలగించి, అనుమతులు ఇప్పించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె. అహ్మద్ కోరారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ.. వనమా కాలనీలో ఏళ్ల తరబడి పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్నాయని, కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి మరింత జటిలమవుతోందని, తాగునీటితో పాటు కనీస గృహ అవసరాలకు కూడా నీరు దొరక్క స్థానికులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత ఖర్చులతో ఇళ్ల వద్ద బోర్లు వేయించుకునేందుకు కాలనీవాసులు ప్రయత్నిస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, బోర్ వెల్ వాహనాలను సైతం సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. కనీస అవసరమైన తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఉన్నతాధికారులతో మాట్లాడి వనమా కాలనీ ప్రజలు బోర్లు వేసుకునేలా శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

