కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting) మాఫియాపై సీఐడీ భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించింది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన ముఠాకు చెందిన 11 మందిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు నిర్వహించిన దాడుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం సీఐడీ చీఫ్ చారు సిన్హా మీడియాకు వివరాలు వెల్లడించారు. “డఫాబెట్” యాప్‌తో పాటు డఫాబెట్ వెబ్‌సైట్ ద్వారా క్రికెట్, క్యాసినో గేమింగ్ పేరుతో అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను గుర్తించారు. ఈ నెట్‌వర్క్ ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేసి భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది.
సీఐడీ విచారణలో ఈ బెట్టింగ్ మాఫియా కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లు బయటపడింది. ఫిలిప్పీన్స్‌లో ప్రారంభమైన ఈ నెట్‌వర్క్ అనంతరం యునైటెడ్ కింగ్‌డమ్‌కు విస్తరించి, ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఠాలో కొందరు మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సృష్టించడం, మరికొందరు వాటిని నిర్వహించడం, ఇంకొందరు సాంకేతిక సహాయం అందించడం వంటి బాధ్యతలు చేపట్టినట్లు తేలింది. ఈ కేసులో భాగంగా 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది. నిందితులు రోజుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
కరీంనగర్‌లో నమోదైన డఫాబెట్ కేసు ఆధారంగా దర్యాప్తు
కరీంనగర్‌లో నమోదైన డఫాబెట్ కేసు ఆధారంగా ప్రారంభమైన దర్యాప్తు 15 రోజుల పాటు కొనసాగగా, సుమారు 40 మంది అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై సీఐడీ కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 414 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే 108 ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను గుర్తించి వాటిని బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపించారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో 37 యాప్‌లపై జియో-ఫెన్సింగ్ అమలు చేసి, తెలంగాణలో మాత్రమే అవి అందుబాటులో లేకుండా చర్యలు తీసుకున్నట్లు చారుసిన్హా వెల్లడించారు. డఫాబెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదైనట్లు సీఐడీ తెలిపింది.
ఇది దేశవ్యాప్తంగా విస్తరించిన పెద్ద బెట్టింగ్ మాఫియా వ్యవస్థగా అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కూడా సీఐడీ గుర్తించింది. వారికి ఇప్పటికే కౌన్సెలింగ్ చేసినట్లు చారు సిన్హా తెలిపారు. ఇకపై వారు బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను సీఐడీకి బదిలీ చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. యువతను, సాధారణ ప్రజలను మోసం చేస్తున్న బెట్టింగ్ ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని సీఐడీ హెచ్చరించింది.
హెచ్‌సీఏ అక్రమాలపై సిట్ దర్యాప్తు ముమ్మరం..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో చోటుచేసుకున్న ఆర్థిక అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోందని సీఐడీ చీఫ్ చారు సిన్హా తెలిపారు. హెచ్‌సీఏపై గతంలో నమోదైన కేసులతో పాటు తాజాగా నమోదైన కేసులపైనా సిట్ లోతుగా దర్యాప్తు నిర్వహిస్తోందని వెల్లడించారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం హెచ్‌సీఏ అధ్యక్షుడు, కార్యదర్శిని ఇప్పటికే సీఐడీ అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరిన్ని అంశాలపై విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ-ఫార్ములా రేస్ కేసుపై స్పందిస్తూ..ఈ కేసులో ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. త్వరలోనే కోర్టులో విచారణ (ట్రయల్స్) ప్రారంభం కానుందని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో వెలుగుచూసిన మైనింగ్ అక్రమాలపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసిందని, ఈ అంశంపై సీఐడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్‌లలో పాల్గొనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, విచక్షణతో వ్యవహరించాలని సూచించారు. సీఐడీ చేపడుతున్న ఈ దర్యాప్తులు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చారు సిన్హా పేర్కొన్నారు.

