కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్‌కప్ (FIFA World Cup) 2026 తో పాటు 2030, మహిళల వరల్డ్‌కప్ 2027 సహా పలు FIFA ఈవెంట్ల భారత ప్రసార హక్కులను జీ ఎంటర్‌టైన్‌మెంట్ దక్కించుకుంది. ఫుట్‌బాల్ అభిమానులకు భారీ అప్‌డేట్ వచ్చింది. ఫిఫా వరల్డ్‌కప్ 2026 నుంచి 2034 వరకు జరిగే పలు కీలక FIFA టోర్నీల భారత మీడియా హక్కులను జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది. దీంతో భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లతో పాటు మరిన్ని FIFA ఈవెంట్లు జీ ఛానళ్లలో, Zee5 ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానున్నాయి.
జూన్ 11 నుంచి ప్రారంభమయ్యే ఫిఫా వరల్డ్‌కప్ 2026 మ్యాచ్‌లు Unite8 Sports ఛానళ్లతో పాటు Zee5లో ప్రసారం కానున్నాయి. అభిమానులకు మరింత మెరుగైన వీక్షణ అనుభవం అందించేందుకు జీ నాలుగు ప్రత్యేక స్పోర్ట్స్ ఛానళ్లను కూడా ప్రారంభించింది. వీటిలో Unite8 Sports 1, Unite8 Sports 1 HD, Unite8 Sports 2, Unite8 Sports 2 HD ఉన్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్ Zee5లో కూడా అభిమానులు తమకు నచ్చిన భాషలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూసే అవకాశం ఉంటుందని సంస్థ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేక్షకులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. జీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఫిఫా వరల్డ్‌కప్ 2026, 2030 ఎడిషన్లతో పాటు మహిళల వరల్డ్‌కప్ 2027, ఇతర కీలక FIFA ఈవెంట్లు, డాక్యుమెంటరీ కంటెంట్ హక్కులు కూడా ఈ ఒప్పందంలో భాగమయ్యాయి. అంతేకాదు, 2026 నుంచి 2034 మధ్య జరిగే పలు వయో విభాగాల ప్రపంచకప్‌లు, ఫుట్‌సాల్ టోర్నీలు కూడా ‘జీ’లో ప్రసారం కానున్నాయి. వీటిలో పురుషుల అండర్-17 వరల్డ్‌కప్, మహిళల అండర్-17 వరల్డ్‌కప్, పురుషుల అండర్-20 వరల్డ్‌కప్, మహిళల అండర్-20 వరల్డ్‌కప్, ఫుట్‌సాల్ పురుషుల, మహిళల వరల్డ్‌కప్‌లు, ఇంటర్‌కాంటినెంటల్ కప్ కూడా ఉన్నాయి.
ఈ భాగస్వామ్యంపై జీ సీఈఓ పునీత్ గోయెంకా స్పందించారు. ఫుట్‌బాల్ ప్రాంతాలు, వయసులతో సంబంధం లేకుండా అభిమానులను ఆకట్టుకునే క్రీడ అని ఆయన తెలిపారు. మీడియా హక్కులు తీసుకోవడం, ప్రత్యేక స్పోర్ట్స్ ఛానళ్లు ప్రారంభించడం ద్వారా ఫుట్‌బాల్ భవిష్యత్తుపై తమకు ఉన్న నమ్మకం కనిపిస్తోందని చెప్పారు. FIFAతో భాగస్వామ్యం వల్ల భారత మార్కెట్‌లో ఫుట్‌బాల్‌కు మరింత విస్తరణ లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
FIFA చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోమీ గై కూడా ఈ ఒప్పందంపై స్పందించారు. ఫిఫా వరల్డ్‌కప్ ప్రపంచంలో అతిపెద్ద క్రీడా వేదికలలో ఒకటని పేర్కొన్నారు. యువత, ఉత్సాహభరిత ప్రేక్షకుల కారణంగా భారత మార్కెట్ FIFAకి ఎంతో ముఖ్యమని చెప్పారు. జీకి ఉన్న విస్తృత ప్రసార వ్యవస్థ, స్థానిక ప్రేక్షకులపై అవగాహన ఫుట్‌బాల్ చేరువను మరింత పెంచుతుందని ఆయన భావించారు. ఇక 2026 ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నీగా నిలవనుంది. మొదటిసారి 32 జట్ల బదులుగా 48 జట్లు పోటీలో పాల్గొంటాయి. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 16 నగరాల్లో 16 వేదికలపై రికార్డు స్థాయిలో 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

