నేటి నుంచే సభాసమరం.. నినాదాలతో హోరెత్తనున్న అసెంబ్లీ!

కలం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ (Telangana Assembly) సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ వ్యూహాలు రచిస్తుండగా.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీ రూపొందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నిషేధిత భూముల జాబితా అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుండగా.. గత, ప్రస్తుత లెక్కలను బయటపెట్టి ఎవరి హయాంలో తప్పు జరిగిందో ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

అసెంబ్లీ(Telangana Assembly)కి హాజరుకాని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా.. నిషేధిత భూముల జాబితాలో జరిగిన తప్పులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) రాజీనామా చేయాల్సిందేనని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. వీటికితోడు ఫీజు రీయింబర్స్‌మెంట్, పాలిటెక్నిక్ అంశాలపైనా సభలో వాడీవేడి చర్చ జరిగే అవకాశమున్నది. ఇటు ప్రతిపక్షాలు, అటు అధికారపక్ష వ్యూహప్రతివ్యూహాలతో అసెంబ్లీ మాటల యుద్ధం జరగనున్నది. దీంతో అధికార, ప్రతిపక్ష నినాదాలతో అసెంబ్లీ హోరెత్తనుంది.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11 వరకు సమావేశాలు జరిగే అవకాశమున్నది. సోమవారం మధ్యాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు జరగాలన్నది నిర్ణయించనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశమున్నది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా భూభారతి పోర్టల్‌లోని నిషేధిత భూముల జాబితా (22-ఏ) అంశాన్ని బీఆర్ఎస్, బీజేపీ లేవనెత్తున్నాయి.

ఈ విషయమై ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్ (బీఆర్ఎస్), ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (బీజేపీ) తదితరులు ఓపెన్‌గానే మీడియాకు వివరించారు. కమీషన్ల పేరుతో డబ్బులు నొక్కేయడానికే నిషేధిత జాబితాలో పేదల పట్టా భూములను ప్రభుత్వం పెట్టిందని, దీనికి బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. అదే టైమ్‌లో గత ప్రభుత్వంలో ధరణి పేరుతో భూముల దోపిడీ జరిగిందంటూ లెక్కలన్నింటినీ ఏకరువు పెట్టి కౌంటర్ ఇవ్వడానికి రెవెన్యూ మంత్రి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య బ్లేమ్ గేమ్ సీరియస్ స్థాయిలో చోటుచేసుకునే అవకాశమున్నది.

కేటీఆర్‌‌కు నో చాన్స్

సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఈసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు కష్టమేనని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత , లేదంటే ఆ పార్టీకి చెందిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు మాత్రమే మాట్లాడాలనే ప్రశ్న కేటీఆర్‌కు ఎదురయ్యే అవకాశమున్నదని సమాచారం. హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి మాత్రమే బీఆర్ఎస్ తరఫున మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం కల్పిస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌కు మాట్లాడే అవకాశం దాదాపు ఉండదన్న అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఈ సమావేశాలను బహిష్కరిస్తారా? అనే చర్చ జరుగుతున్నది.

రాజీనామాలపై డిమాండ్లు

అసెంబ్లీలో రాజీనామాలపై డిమాండ్లు వెల్లువెత్తనున్నాయి. నిషేధిత భూముల జాబితా విషయంలో తప్పు జరిగిందని, దీనికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బాధ్యుడిని చేస్తూ కేబినెట్ నుంచి తప్పించాలని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి చేయనున్నది. ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కానందుకు, ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించనందుకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ రిజైన్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయనున్నది. రెండు పార్టీల పోటాపోటీ డిమాండ్లు, వ్యూహాలతో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి పొంగులేటిని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తే, కేసీఆర్‌ను కాంగ్రెస్ టార్గెట్ చేయనున్నది.

సీఎం లేదా డిప్యూటీ సీఎం వివరణలు

విద్యార్థులకు దాదాపు రూ.15 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నదంటూ బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. విద్యార్థులను సమీకరించి ఈ అంశంపై ఆందోళనలు చేస్తున్నాయి. ధర్నాచౌక్ దగ్గర రెండు పార్టీలు పోటాపోటీగా దీక్షలు, నిరసనలు చేస్తున్నాయి. దీనిపై స్వయంగా సీఎం, లేదంటే డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశమున్నది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలెన్నో, కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందెంతో లెక్కలతో సహా వివరించనుంది.

పాలిటెక్నిక్ విద్యా విధానంలో కొన్ని మార్పులను తీసుకొస్తూ రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 97 విషయంలోనూ సీఎం లేదా డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చే అవకాశమున్నది. మంత్రి వివేక్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా పాలిటెక్నిక్ విద్యార్థులు సంతృప్తి చెందకపోవడంతో అసెంబ్లీ వేదికగా సీఎం క్లారిటీ ఇస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇచ్చే వివరణ కీలకం కానున్నది.

Also Read : ఎయిర్‌పోర్టులో భీకర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>