కలం, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని జగిత్యాల రూరల్ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 89 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెల్గల్(Chelgal) గ్రామ శివారులోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో జగిత్యాల రూరల్ పోలీసులు (Jagtial Rural Police) తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి విక్రయిస్తున్నట్లు అనుమానించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా అతని వద్ద 89 గ్రాముల గంజాయి లభించింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పట్టుబడిన వ్యక్తిని జగదీష్ మున్న జాంబేకర్ (46) గా గుర్తించారు. అతడు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా సాలేబాడ్, అంజన్గావ్ స్టాప్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు జగిత్యాల రూరల్ ఎస్ఐ ఆర్. ఉమాసాగర్ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ ఉమాసాగర్ సూచించారు. ఈ మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

