Mobile Popup Ad
Mobile Popup Ad

తేజస్వి సూర్య క్లారిటీ: ఆ వ్యాఖ్యల వెనుక అసలు నిజమిదే!

కలం, వెబ్​ డెస్క్​ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై (Women Reservation Bill) లోక్ సభలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరును, ఆ పార్టీ చేసిన ద్రోహాన్ని ఎత్తిచూపడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల, అమరవీరుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఆ పోరాట స్ఫూర్తిని తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే తన మాటలను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమం (Telangana Movement) సందర్భంగా కాంగ్రెస్ హయాంలో జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేశారు. 1969లో జరిగిన పోలీసు కాల్పుల్లో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం నుంచి, యూపీఏ ప్రభుత్వ హయాంలో 1200 మందికి పైగా బలిదానాలు చేసుకోవడం వరకు అంతా కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏకాభిప్రాయం లేకుండా, భాగస్వామ్య పక్షాలను పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డారు. బ్రిటిష్ పాలకులు దేశాన్ని ఏ విధంగా విభజించారో, అదే రీతిలో కాంగ్రెస్ వ్యవహరించిందని, ఆ వైఖరిని ఎండగట్టడానికే తాను విభజన అంశాన్ని ప్రస్తావించానని వివరించారు.

దశాబ్దాల కాలంగా దక్షిణ భారత రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తేజస్వి సూర్య (Tejasvi Surya) కోరారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న నిజనిజాలను ప్రజల ముందు ఉంచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను, వారు పడిన వేదనను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని, కేవలం కాంగ్రెస్ చేసిన కుట్రలను బయటపెట్టడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Read Also: రామలక్ష్మణులు వలస కూలీలు: ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>