కలం, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సంభల్ జిల్లాలో ఓ యువకుడు స్నేహితుడి చేతిలో కిరాతకంగా హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోహైల్ అనే 18 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి సలార్‌పూర్ కలాన్ దగ్గర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ (Swimming Pool)కు ఈతకు వెళ్లాడు. అందరూ సరదాగా ఈత కొడుతున్న క్రమంలో ఊహించని దారుణం జరిగింది. సోహైల్ స్నేహితుడు అతడి తలను పట్టుకొని బలంగా నీటిలో అణచిపెట్టాడు. రెండు నిమిషాల పాటు సోహైల్‌ను అలాగే నీటిలో పెట్టి ఊపిరాడకుండా చేశాడు. సోహైల్ చేతులెత్తి సాయం కోసం ఎంత కొట్టుమిట్టాడినా చుట్టుపక్కల వారు గమనించకపోవడంతో అతడు నీటిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
అయితే, సోహైల్‌కు ఈత వచ్చని తెలిసిన కుటుంబ సభ్యులు అతడి మృతిపై అనుమాన్యం వ్యక్తం చేశారు. వెంటనే సీసీ టీవీ (CCTV) దృశ్యాలను పరిశీలించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సోహైల్‌ను రెండు నిమిషాల పాటు నీటిలోనే ముంచి చంపేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోవడం కూడా వీడియోలో స్పష్టంగా కనిపించింది. సోహైల్ తండ్రి రైస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణ హత్యకు పాల్పడ్డ సోహైల్ స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

