భారత్ టూర్ రికార్డ్ హవా: 50 వేల టికెట్లు ఖాళీ!

కలం, స్పోర్ట్స్ : భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు (New Zealand Tour) సంబంధించిన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ల విక్రయాలు ప్రారంభమైన కేవలం రెండు వారాల్లోనే 50 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం క్రికెట్ అభిమానుల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత టీమిండియా(Team India) న్యూజిలాండ్‌లో పర్యటించనుండటంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలుత క్రికెట్ నేషన్ సభ్యులు, స్కై, ఏఎన్‌జెడ్ కస్టమర్లకు ప్రత్యేకంగా రెండు వారాల ముందస్తు టికెట్ విక్రయాలను నిర్వహించారు. అనంతరం సోమవారం నుంచి సాధారణ అభిమానులకు టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

సాధారణ విక్రయాలు ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే పలు మ్యాచ్‌లకు టికెట్లు దాదాపు పూర్తిగా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ వేదికగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు ఇప్పటికే 75 శాతం టికెట్లు విక్రయమైనట్లు సమాచారం. మరోవైపు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా అక్టోబర్ 30న, శుక్రవారం జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. టికెట్లకు భారీ డిమాండ్ నేపథ్యంలో 2019 తర్వాత తొలిసారిగా స్టేడియంలోని 6వ టియర్ సీటింగ్‌ను కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.

టికెట్ల విక్రయాలపై న్యూజిలాండ్ క్రికెట్ మార్కెటింగ్ హెడ్ టిమ్ ఎల్లిస్ స్పందిస్తూ.. ఈడెన్ పార్క్‌లో పైస్థాయి సీటింగ్‌ను తిరిగి తెరవాల్సి రావడం ఈ పర్యటనకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు. మైదానానికి వచ్చే అభిమానులకు మ్యాచ్‌ను మరింత ప్రత్యేక అనుభూతిగా మార్చేందుకు మ్యాచ్ సమయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, వినోద వేడుకలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో భారత్-న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభానికి ముందే టికెట్ల విక్రయాలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>