కలం, స్పోర్ట్స్ : జూనియర్ ఆసియా కప్ (Junior Asia Cup)లో భారత్ అదరగొట్టింది. చైనీస్ తైపీని ఏకంగా 15-0తో చిత్తు చేసింది. కెప్టెన్ అన్మోల్ ఇక్కా ఆరు గోల్స్‌తో మెరిశాడు. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదటి క్వార్టర్‌లో భారత్‌కు గోల్ దక్కలేదు. చైనీస్ తైపీ డిఫెన్స్ గట్టిగా నిలిచింది. బ్రేక్ తర్వాత భారత్ జోరు పెంచింది. 17వ నిమిషంలో ఆర్యన్ ఎక్స్ గోల్ చేశాడు. వెంటనే ప్రభ్‌దీప్ సింగ్ మరో గోల్ కొట్టాడు. 22వ నిమిషంలో గుర్‌సేవక్ సింగ్ గోల్‌తో భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
25వ నిమిషంలో అన్మోల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. 28వ నిమిషంలో అర్జున్ సంతోష్ హర్గుడే స్కోరు పెంచాడు. ఆ వెంటనే అన్మోల్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ చేశాడు. హాఫ్ టైమ్‌కు భారత్ 6-0తో ఆధిక్యంలో ఉంది. మూడో క్వార్టర్‌లోనూ భారత్ అదే దూకుడు కొనసాగించింది. అన్మోల్ వరుసగా పెనాల్టీ కార్నర్ గోల్స్ చేశాడు. ఈ క్రమంలో అతడి ఖాతాలో నాలుగు గోల్స్ చేరాయి. అజీత్ యాదవ్ మరో గోల్ చేశాడు. 45వ నిమిషంలో అన్మోల్ మరోసారి గోల్ చేశాడు.
దీంతో భారత్ మూడో క్వార్టర్ ముగిసే సరికి 10-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి క్వార్టర్‌లోనూ భారత్ ఆగలేదు. 48వ నిమిషంలో హర్పాల్ గోల్ చేశాడు. 51వ నిమిషంలో అన్మోల్ తన ఆరో గోల్ నమోదు చేశాడు. హర్పాల్ మరో గోల్ కొట్టగా.. ఆర్యన్ ఎక్స్ కూడా రెండో గోల్ పూర్తి చేశాడు. చివరకు భారత్ 15-0తో భారీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పూల్-ఏలో భారత్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మూడు విజయాలు, ఒక డ్రాతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. దక్షిణ కొరియా కూడా సెమీఫైనల్‌కు చేరింది.

