కలం, దమ్మ పేట : గిరిజన విద్యార్థుల (Tribal students) సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దమ్మపేట (Dammapeta) మండల కేంద్రంలోని ఐటీడీఏ పరిధిలోని గిరిజన వసతి గృహంలో (Tribal Hostel) మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
చుక్కనీటి కోసం విద్యార్ధుల పోటాపోటీ
వసతి గృహంలోని బోరు మోటారు పనిచేయకపోవడంతో పాటు భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా మూడు రోజులుగా సరఫరా కావడం లేదని విద్యార్థులు తెలిపారు. దీంతో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టాయిలెట్ల వినియోగం, స్నానాలు, బట్టలు ఉతుక్కోవడానికి నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరత కారణంగా కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. విద్యార్థుల భోజన అవసరాల కోసం హాస్టల్ సిబ్బంది బయట నుంచి నీటిని తీసుకొచ్చి వినియోగిస్తున్నట్లు సమాచారం.
సమస్యను పరిష్కరించాలని విద్యార్ధుల వేడుకోలు
వసతి గృహంలో నీటి సమస్య పరిష్కరించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులు వెంటనే స్పందించి బోరు మోటారును మరమ్మతు చేయడంతో పాటు భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించి, హాస్టల్కు నిరంతర నీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

