కలం, స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో అక్రమాలు మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి. హెచ్‌సీఏను కొందరు తమ సొంత వ్యాపారంగా మార్చేస్తున్నారని, దీనిపై వెంటనే సీఐడీ లేదా సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. టీజీ20 ఖాతాలను స్తంభింపజేసి, రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే సీఐడీకి అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
తెలంగాణ క్రికెట్ పరిపాలనలో అక్రమాలపై గత ఏడాది జూలై 9, 2025న సీఐడీ జరిపిన విచారణలో కొందరి అరెస్టులు కూడా జరిగాయి. ఆ తర్వాత జూలై 20, 2025న హైకోర్టు జోక్యం చేసుకుని హెచ్‌సీఏ పనితీరును పర్యవేక్షించడానికి రిటైర్డ్ జస్టిస్ పి. నవీన్ రావును నియమించింది. అయితే కోర్టు పర్యవేక్షణ ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్ కమిటీలు, నియామకాలు, ఆర్థిక నిర్ణయాలు జరిగిపోతున్నాయని గురువారెడ్డి ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ క్రికెట్ క్లబ్ పేరిట ఒకే పేరుతో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెండు సొసైటీలు నమోదయ్యాయనే పెద్ద మోసాన్ని ఆయన బయటపెట్టారు. ఈ నకిలీ గుర్తింపుతోనే హెచ్‌సీఏ ఓటర్ల జాబితాను మార్చేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. దీనివల్లే నవంబర్ 6, 2025న క్లబ్ బాధ్యతల్లోకి వచ్చిన ఎం. జీవన్ రెడ్డి, కేవలం నాలుగు నెలల్లోనే అంటే మార్చి 2026లో హెచ్‌సీఏ (HCA) గౌరవ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మండిపడ్డారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా తీవ్ర అనుమానాలకు తావిస్తోందని, ఇందులో ఫోర్జరీ, మాల్ ప్రాక్టీస్ జరిగాయని ధ్వజమెత్తారు.
ఆ తర్వాత కూడా అక్రమాలు ఆగలేదని, ఏజీఎం ఆమోదం లేకుండా, బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా అగం రావు నేతృత్వంలో ఒక అక్రమ టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారని గురువారెడ్డి తెలిపారు. ఇప్పుడు ఈ కౌన్సిల్ ద్వారా ఒక్కో టీజీ20 ఫ్రాంచైజీని 3 నుంచి 10 కోట్ల రూపాయలకు వేలం వేసి, వంద కోట్ల రూపాయల లావాదేవీలు జరపడానికి ప్లాన్ చేస్తున్నారని, ఈ నిధులు పక్కదారి పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అంబటి రాయుడుతో పాటు కొందరు ఆటగాళ్లను వివిధ ప్యానెళ్లలో నియమించడం హెచ్‌సీఏ బైలాస్ నిబంధనలకు విరుద్ధమని, ఇందులో పరస్పర ప్రయోజనాల సంఘర్షణ ఉందని పేర్కొన్నారు.
Read Also: అధిక మాసంలో ఇలా చేస్తే.. 14 ఏళ్ల పాటు సిరిసంపదలు ఖాయం!
Follow Us On: WhatsApp

