కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhusudhan) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పోలీసులు అడ్డుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఒక్కసారిగా ఊగిపోయారు. తన ప్యాంటు పట్టుకుని లాగారని ఆరోపించిన ఆయన.. తన ప్యాంటు పట్టుకుని లాగడానికి పోలీసులకు అధికారం ఎవడిచ్చాడు? అంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు, స్పీకర్ పై బండ బూతులు మాట్లాడారు.
తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దళిత స్పీకర్ను పట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అసభ్య పదజాలంతో దూషించడం తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. దళిత నాయకుడిని అవమానించడం మీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ సంస్కృతా? ఇది దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. తాతా మధుపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నా హక్కులను ఎవరూ కాలరాయలేరు: తాతా మధు
తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివరణ ఇచ్చారు. తాను స్పీకర్ను ఏమీ అనలేదని.. పోలీసుల తీరుపైనే మాట్లాడినట్లు వెల్లడించారు. తన హక్కులను ఎవరూ కాలరాయలేరని వ్యాఖ్యానించారు. తానేదో అనుచితంగా మాట్లాడానని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సభకు , చైర్ కు ఎంతో గౌరవం ఇచ్చే వ్యక్తిని తాను అని చెప్పుకొచ్చారు. క్షమాపణ చెప్పాల్సి వస్తే సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఏ సీఎం మాట్లాడని మాటలు సీఎం మాట్లాడినట్లు తెలిపారు.

